Chandrababu: తెనాలి ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

  • తెనాలిలో ప్రజాగళం సభ
  • నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్ లను గెలిపించాలన్న చంద్రబాబు
  • మే 13న సైకో పీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు
  • స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై ఫైర్ 
  • తాట తీస్తాం... అనవసరంగా రెచ్చిపోకు అంటూ హెచ్చరిక 
Chandrababu strong warning to Tenali MLA

తెనాలి ప్రజాగళం సభలో  టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. ఆంధ్రా ప్యారిస్ తెనాలికి చాలాసార్లు వచ్చాను కానీ, ఇవాళ జనసందోహాన్ని చూసిన తర్వాత మరింత హుషారుగా ఉందని అన్నారు. మే 13తో రాష్ట్రానికి సైకో పీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా, లేరా? అని ప్రశ్నించారు. 

తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

ఇవాళ తాను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పారు. మన మేనిఫెస్టోకి, సైకో మేనిఫెస్టోకి పోలిక ఉందా? అని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో  ప్రజలు అనేక అవకాశాలు, ఆదాయం కోల్పోయారని, ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లేవని... తన ఆవేదన అదేనని అన్నారు. మైనారిటీలు, మహిళలు... రాష్ట్రంలో ఇలా ఎవరూ బాగుపడలేదని తెలిపారు. 

సుపరిపాలన అంటూ ఒక పక్క సంక్షేమం ఉండాలని, మరోపక్క అభివృద్ధి ఉండాలని చంద్రబాబు వివరించారు. ఈ ముఖ్యమంత్రి తనను ఎవరేం చేస్తారన్న అహంకారంతో ఉన్నాడని, ఆ అహంకారం దిగాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. జగన్ వంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని, చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. 

"ఇదంతా నా కోసం చెబుతున్నానని మీరనుకుంటున్నారు. నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలా? నేను చూడని పదవా ఇది? పవన్ కల్యాణ్ కు పదవి కావాలా? పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి. అడుగడుగునా నీరాజనాలు పలుకుతారు. అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరా తిరగాలా? కానీ ప్రజల కోసం కష్టపడుతున్నాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం బాగుపడాలి, పిల్లల భవిష్యత్ బాగుండాలి అని కలిశాం" అని వివరించారు. 

ఆంధ్రా ప్యారిస్ ప్రజలు తెలివైనవాళ్లు అని చంద్రబాబు కొనియాడారు. మీ తెలివిని ఉపయోగించండి, చైతన్యవంతులు కండి, ఒకరు పదిమందికి చెప్పండి అని పిలుపునిచ్చారు. 

"తెనాలి చరిత్రలో ఎప్పుడూ జరగని అరాచకాలు జరిగాయి. సెంటు పట్టా కోసం సేకరించిన భూముల్లో రూ.80 కోట్లు దోచాడు ఇక్కడుండే ఎమ్మెల్యే. వెంచర్లు వేయాలన్నా, అపార్ట్  మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిందే. ఈయన పేరు చెప్పను కానీ... రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్... కొత్తగా శివకుమార్ ట్యాక్స్! రేపు అతడికి మళ్లీ ఓటేస్తే ఈసారి శివకుమార్ ట్యాక్స్ అని చట్టం చేస్తాడు. 

ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన యుగంధర్ అనే కౌన్సిలర్ పై దాడి చేస్తావా... ఖబడ్దార్... జాగ్రత్తగా ఉండు... తాట తీస్తాం... ఒళ్లు దగ్గరపెట్టుకో... మీ తండ్రి కూడా నా దగ్గర పనిచేశాడు... అన్నీ నాకు తెలుసు... తమాషా అనుకోవద్దు... అనవసరంగా రెచ్చిపోకు. మొన్న సైకో వచ్చి ఈ ఎమ్మెల్యేని స్వాతిముత్యం అంటూ పరిచయం చేశాడు. ఇలాంటి స్వాతిముత్యం మీకు కావాలా? పాపం అవినాశ్ రెడ్డి పిల్లాడంట... పిల్లాడైతే స్కూలుకు పంపించాలి" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News